బీసీల విషయంలో కాంగ్రెస్‌ను మించిన చిత్తశుద్ది మరేఇతర పార్టీకి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అంబర్‌పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన బీసీ బంద్(BC Bandh) ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన బీసీ బంద్‌కు మద్దతు తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాటం అయిపోలేదని, సాధించేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశఆరు. ‘‘కుల సర్వే చేశాం. జీఓ ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.

