కలం డెస్క్ : ఒడిషాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు (Maoist) పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు (CCM) ఉయికె గణేశ్ (Uyike Ganesh) అలియాస్ పాక హన్మంతు (Paka Hanumanthu) చనిపోయినట్లు ఆ రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్స్ విభాగం అదనపు డీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ – గంజాం జిల్లాల పరిధిలోని రాంభా అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుఝామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) మొత్తం నలుగురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇందులో ఇద్దరు మహిళలు అని తెలిపారు. మృతుడు ఉయికె గణేశ్ (పాక హన్మంతు)పై రూ. 1.10 కోటి రివార్డు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ముగ్గురిని గుర్తించాల్సి ఉన్నదన్నారు. ఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్ (Insas) రైఫిళ్ళు, ఒక .303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురూ ఆలివ్ గ్రీన్ యూనిఫాంలోనే ఉన్నారని తెలిపారు.
పక్కా సమాచారంతోనే జాయింట్ ఆపరేషన్ :
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Intelligence Bureau) అందించిన సమాచారంతో అటవీ ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఒడిషా పోలీసులు పేర్కొన్నారు. రెండు సీఆర్‌పీఎఫ్ (CRPF), ఒక బీఎస్‌ఎఫ్ (BSF) బృందాలతో కలిసి ఒడిషా ఎస్ఓజీకి (Special Operation Group) చెందిన 20 పోలీసు బృందాలు సంయుక్త ఆపరేషన్ జరిపినట్లు వివరించారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన పాక హన్మంతు మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. గతంలో చత్తీస్‌గడ్‌లో పనిచేసిన పాక హన్మంతు మూడేండ్ల క్రితం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని పశ్చిమ కనుమల్లో దళాలను ఏర్పాటు చేసే బాధ్యత చేపట్టినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అప్పటిదాకా ఆ బాధ్యతల్లో ఉన్న సంజయ్ దీపక్‌రావు అరెస్టు తర్వాత పాక హన్మంతు (Paka Hanumanthu) ఎంటర్ అయినట్లు సమాచారం. తాజాగా ఒడిషాలో ఆయన ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పారా మిలిటరీ బలగాలు ఒడిషా ఎస్ఓజీ పోలీసుల సహకారంతో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఒడిషా పోలీసులు తెలిపారు.
Read Also: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల
Follow Us On: X(Twitter)


