కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్ సౌత్‌లో శనివారం టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)పై గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడ్డ పలువురి కుటుంబాలను పరామర్శించేందుకు అభిషేక్ నేడు సోనార్‌పూర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనంపై పలువురు నిరసనకారులు రాళ్లు, గుడ్లు, చెప్పులతో దాడి చేశారు. కొంత మంది ఆయనను దొంగ అంటూ నినాదాలు చేశారు. పలువురు అభిషేక్ బెనర్జీకి దగ్గరగా వచ్చి భౌతిక దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన షర్ట్ చిరిగిపోయింది. భద్రతా సిబ్బంది ఆయనకు పోలీస్ హెల్మెట్ పెట్టి అతి కష్టం మీద అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఈ ఘటనపై అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) స్పందించారు. ఇది బీజేపీ చేయించిన దాడి అని ఆరోపించారు. తనను చంపేందుకు దాడి చేశారని, ఈ దాడి బీజేపీ ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనమని మండిపడ్డారు. ఈ దాడి మొత్తం కెమెరాలో రికార్డ్ అయ్యిందని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడేది లేదని, తప్పకుండా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Read Also: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
Follow Us On : WhatsApp

