కలం, యాదగిరిగుట్ట : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, అన్నదాతలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని యాదగిరిగుట్ట (Yadagirigutta) బీజేపీ పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ (Karre Praveen) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు వచ్చి రైతులపై ఏదో మంత్రం వేసినట్లుగా ఉందే తప్ప, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తీరడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసేంతవరకు రాష్ట్రంలో వడ్లు కొనే పరిస్థితి లేకపోయిందని కర్రె ప్రవీణ్ విమర్శించారు. నేటికీ కలాల్లో ఎక్కడి వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయని, లారీలలో వడ్లను సకాలంలో తరలించే కనీస వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “రైతే రాజు” అంటూనే అన్నదాతలను అరిగోస పెడుతున్నారని, సీఎం, మంత్రులు తమ కుమ్ములాటల్లో బిజీగా ఉంటూ రైతుల కష్టాలను హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడానికే పరిమితమయ్యారని, ప్రజా సమస్యలపై వారికి పట్టింపు లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించిన ‘వరంగల్ డిక్లరేషన్’ ఏమైందని ప్రవీణ్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎంతమంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అయింది? ఎంతమంది కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించారు? అని ఆయన నిలదీశారు. మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు ప్రక్రియ చేపడతామని చెప్పి, కేవలం కమిషన్ల కక్కుర్తిలోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు గుంటుపల్లి మహేశ్వరి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కొప్పుల యాదిరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, మండల కౌన్సిల్ మెంబర్ మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్, పట్టణ కార్యదర్శి దొమ్మట ప్రభాకర్, ఆవుల సత్యనారాయణ, ఆలేటి కర్ణ, పలువుల సురేష్ పాల్గొన్నారు.

