కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. కరీంనగర్ జిల్లా బీజేపీ శ్రేణుల ప్రశిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచందర్ రావు మాట్లాడారు. పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుతో పాటు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలకు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్లను సరిగా కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. స్వయంగా తానే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ‘రైతు గోస బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర నిర్వహించినట్లు తెలిపారు.
అయిప్పటికీ ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్ర వీడలేదని, అందుకే అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వద్ద పంట సేకరణ విషయంలో నిర్దిష్ట గణాంకాలు లేవని, మంత్రులే తలా తోక లేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. వారి వద్ద ఉన్న లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. అసలు ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? లేక రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుతిలి తాడు మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమే చేస్తుందని , మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందన్నారు. చేతకాని ప్రభుత్వంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని , కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కొనుగోళ్లను వదిలేసి ఎరువుల గురించి ముందే మాట్లాడుతూ భవిష్యవాణి చెప్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. కొనుగోళ్లలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రేపు రాబోయే కాలానికి ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచనతో అనవసర వ్యాఖ్యలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, యూరియా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. రైతులకు యూరియాను సక్రమంగా సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తే ఖబర్దార్ అని ఆయన హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బోడిగే శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

