కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల యూరియా సమస్యపై తరుచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక చోట యూరియా కోసం చెప్పుల క్యూలైన్లు దర్శనమిస్తుండటం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి ఈ సమస్యను కొంతమేరకు పరిష్కరించగలిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) స్పందించారు. రైతులు అవసరం మేరకే యూరియా వాడాలని సూచించారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో బేయర్స్ కంపెనీ వ్యవసాయ డ్రోన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ డ్రోన్ వినియోగించి పురుగుల మందులు మోతాదులో మాత్రమే చల్లాలని సూచించారు. అలా చేస్తే భూసారం పెరుగుతుందన్నారు. యూరియా వినియోగం తగ్గించి పంటల దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.
వ్యవసాయసాగులో శాటిలైట్ వినియోగం
వ్యవసాయ సాగులో శాటిలైట్ వినియోగించుకుంటూ తెగులు ఎక్కడ ఉందో గుర్తించి అక్కడ మాత్రమే పురుగుల మందు వినియోగించేలా పైలెట్ ప్రాజెక్టు అగ్రి వాస్ కంపెనీతో అమలు చేస్తున్నామన్నారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గిస్తూ ఆదాయం పెంచుకునేలా రైతులు నూతన పద్ధతులను అలవర్చుకోవాలని Thummala Nageswara Rao సూచించారు
రసాయనాలు తగ్గించాలి
కెమికల్స్ ఉన్న ఎరువులు వాడకం అధికం కావడం వల్ల పురుగుల మందులు అవసరం ఉంటుందని చెప్పారు. రైతులు క్రమ పద్ధతిలో సహజ పద్ధతులలో సాగు చేయడం వైపు దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. బోగస్ కంపెనీలు హెచ్‌డి విత్తనాల పేరిట నకిలీ విత్తనాలు రైతులకు అందించడం వల్ల చాలా నష్టపోతున్నారని మంత్రి పేర్కొననారు. వ్యవసాయ డ్రోన్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు శిక్షణ అందించి, వారికి సబ్సిడీపై అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని అన్నారు. సాయిల్ టెస్టింగ్ రికార్డులను అప్ డేట్ చేస్తూ ప్రతి రైతుకు వివరాలు అందించే విధానం ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
రైతులకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, కొంతమంది రైతులు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల యూరియా వినియోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదే పద్ధతి కొనసాగిస్తే భవిష్యత్తులో ఆ భూములలో గడ్డి కూడా మొలవదని, రైతులను నాశనం చేసే రాజకీయాలు మనకు అవసరం లేదని పేర్కొన్నారు. ఎరువుల ధరలు క్రమబద్ధీకరణ ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, కాంప్లెక్స్ ధర 1800,యూరియా ధర 260 ఉండటంతో అధికంగా యూరియా వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. మన దగ్గర చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉంటారని, వారికి అనుగుణంగా వ్యవసాయ సాంకేతికత వచ్చే విధంగా కంపెనీలు కృషి చేయాలని మంత్రి తెలిపారు. వరి, పత్తి, మిర్చి పంటల సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుందని, భవిష్యత్తులో మన భూమి భూసారం కోల్పోకుండా కాపాడుకుంటూ వ్యవసాయం కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు.

Read Also: పండుగ వేళ భారీగా పెరిగిన బంగారం ధర
Follow Us On : WhatsApp


