కలం, తెలంగాణ బ్యూరో : త్వరలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ (Telangana Muncipal Elections) లో కవిత (Kalvakuntla Kavitha) తన ప్రతినిధులను బరిలోకి దింపనున్నారా? రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న ఆమె.. ఈ ఎలక్షన్స్ తో జనం నాడిని పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారా?! అంటే.. ‘ఔననే’ సమాధానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడ్తున్నాయి. ఇవి పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో కవిత తరఫున అభ్యర్థులు బరిలోకి ఎలా దిగుతారు?! ఆమెకంటూ ప్రస్తుతం పార్టీ అంటూ ఏదీ లేదు అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్న తరుణంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
ఇండిపెండెంట్లుగా బరిలోకి..
117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ల లిస్టు ప్రిపేర్ అవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఎన్నికల్లో కవిత తరఫున పలువురు తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ప్రతినిధులు, ఆమె అనుచరులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ బాధితులు బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. సత్తా చాటాలని భావిస్తున్నారు. వారి ప్రచారానికి కవిత (Kavitha) మద్దతు తెలుపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘జనం బాట’ పట్టిన ఆమె.. ఎన్నికల్లో తన మద్దతుదారుల తరఫున ప్రచారంలోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
జనం నాడి తెలుసుకునేందుకే..?
బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతుదారులను బరిలో నిలపడం ద్వారా జనం నాడిని తెలుసుకునే చాన్స్ ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పలువురు కవిత మద్దతుదారులు విజయం సాధించారు. ఇప్పుడు మున్సి‘పోల్స్’ బరిలోనూ వాళ్లు నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో ఎన్నో తప్పులు జరిగాయని, వాటన్నింటికీ క్షమాపణలు చెప్తున్నట్లు జనం ముందు కవిత ప్రకటించారు. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. తాను బీఆర్ ఎస్ (BRS) నుంచి బయటకు రావడం, కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంపై జనం ఎలా స్పందిస్తున్నారో టెస్ట్ చేసేందుకు మున్సిపల్ ఎన్నికలను ఆమె వేదికగా మలచుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. కవిత మద్దతుదారులు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిస్తే.. మరింత జోష్ వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తొవ్వ సాఫ్ గా ఉంటుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు.
Read Also: సంక్రాంతి సెలవుల్లో కవిత.. కొత్త పార్టీపై సమాలోచనలు!
Follow Us On: Instagram


