కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సెంటిమెంట్‌తో ఏర్పాటైన ‘తెలంగాణ రాష్ట్ర సమితి'(TRS) పార్టీ.. అదే పేరుతో తెలంగాణలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ని కాస్త భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చివేసిన కేసీఆర్.. అదే దూకుడుతో ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు. కానీ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ పేరుతో బరిలోకి దిగిన పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. అంతేకాదు ఇతర రాష్ట్రాలలోనూ బీఆర్ఎస్ కార్యకలాపాలు ముగిశాయి. తాజాగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కు తోట చంద్రశేఖర్ గుడ్ బై..!
కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక సందర్భంగా జనసేనాని తోట చంద్రశేఖర్ కలిశారు. నిజానికి తోట చంద్రశేఖర్ మెగా బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడు. నాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపనలోనూ, జనసేన పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 జనవరి 2న భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి తోట చంద్రశేఖర్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో మళ్లీ చేరేందుకు తోట చంద్రశేఖర్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యి చేరికపై చర్చలు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఖేల్ ఖతం..
టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చడం ఆ పార్టీకే చేటు అయిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణ పదాన్ని తొలగించటంతో పేరు బంధంతో పాటు పేగు బంధాన్ని కూడా తెంచుకున్నట్టు అయిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణులు డిఫెన్స్‌లో పడిపోయారని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలలో పార్టీ ఊసూ ఎలాగూ లేదు..కనీసం సొంత రాష్ట్రంలోనైన ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తుందని .. అందుకే మళ్లీ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా మార్చే ఆలోచన ఉందంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ పార్టీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్న ఆ పార్టీ నుంచి స్పందన లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు బీఆర్ఎస్‌తో దేశ రాజకీయాలను శాసిస్తాం అనుకున్నా గులాబీ పెద్దలకు తోట చంద్రశేఖర్ నిష్క్రమణతో తమ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఖేల్ ఖతం అయిందనే విషయం తెలుసొచ్చిందని చెప్పొచ్చు.

