కలం, జనగామ : జనగామ–బచ్చన్నపేట ప్రధాన రోడ్డులో చంపక్ హిల్స్ సమీపంలోని ఎంసీహెచ్ ఆసుపత్రి టర్నింగ్ వద్ద ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనగామ (Jangaon) ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ కాలంగా కొనసాగుతుండగా, పోలీసులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారు.
ప్రజాపాలన – ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమం మరియు ‘అరైవ్ అలైవ్’(Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, కాంట్రాక్టర్ రాజి రెడ్డి సహకారంతో రోడ్డుపై ఉన్న గుంతలను బిటుమెన్‌తో ప్యాచ్ చేసి మరమ్మత్తులు చేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఉపశమనం లభించింది. ఈ పనులను జనగామ (Jangaon) డీసీపీ రాజమహేందర్ నాయక్ పర్యవేక్షణలో చేపట్టగా, ఏసీపీ పాండరే చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, ఎస్సై రథీష్, ఎస్సై చెన్నకేశవులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు స్వయంగా పనులను పర్యవేక్షించి వేగంగా పూర్తి చేయించారు. రోడ్డు మరమ్మత్తులతో ప్రజలు, వాహనదారులకు ఇకపై ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలరని అధికారులు తెలిపారు.

