‘టెర్మినాలియా టోమెంటోసా’.. దాహాన్ని తీర్చే అద్భుత వృక్షం!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌కృతి ఒడిలో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో వింత‌లు, విశేషాలు ఉన్నాయి. అలాంటి ప్ర‌కృతి గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. చెట్లంటే మ‌నకు ఆక్సీజ‌న్‌ను ఇస్తాయ‌ని, చెట్ల నుంచి పూలు, పండ్లు, కూర‌గాయ‌లు వ‌స్తాయ‌ని మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ, తీవ్రమైన ఎండా కాలంలో మ‌నుషులు, జంతువుల దాహార్తిని తీర్చే నీటి చెట్టు (Water Tree) కూడా ఒక‌టుంద‌ని మీకు తెలుసా? క‌ర్ణాట‌క‌లోని అడ‌వుల్లో గుర్తించిన అలాంటి చెట్టు గురించి జంగిల్ డైరీస్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. ఆ చెట్టు పేరు ‘టెర్మినాలియా టోమెంటోసా’ (Terminalia Tomentosa). దీనిని సాజ్ లేదా అసన్ అని కూడా పిలుస్తారు.

 టెర్మినాలియా టోమెంటోసా అనేది ఆ చెట్టు శాస్త్రీయ నామం. ఈ చెట్టు పొడి ఆకురాల్చే అడ‌వుల్లో పెరుగుతుంది. తీవ్రమైన వేస‌విలో సైతం త‌న కాండం లోప‌ల‌ నీటిని నిల్వ చేసుకునే అరుదైన సామ‌ర్థ్యం ఈ చెట్టుకు ఉంది. బాగా పెరిగిన కొన్ని చెట్ల కాండం లోప‌ల స‌హ‌జంగానే నీరు నిల్వ ఉంటుంద‌ని, ఆ కాండానికి చిన్న రంధ్రం చేస్తే స్వ‌చ్ఛ‌మైన నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అడ‌వుల్లో నివ‌సించే గిరిజ‌న తెగ‌ల‌కు, వ‌న్య‌ప్రాణుల జాడ‌ను క‌నిపెట్టే ట్రాక‌ర్ల‌కు ఎప్ప‌టి నుంచో తెలుసు. ఈ నీరు తాగ‌డానికి కూడా చాలా రుచిగా ఉండ‌టం విశేషం.

క‌ఠిన‌మైన‌, క‌ర‌వు పీడిత ప్రాంతాల్లో సైతం మ‌నుగ‌డ సాగించ‌డానికి ఈ చెట్టు అల‌వ‌ర్చుకున్న అసాధార‌ణ ల‌క్ష‌ణం ప్ర‌కృతి సృష్టిలోని వింత‌ల‌కు ఒక నిద‌ర్శ‌నం. ఇలాంటి అద్భుతాలు చూసిన‌ప్పుడు అడ‌విలోని ప్ర‌తి చెట్టు వెనుక, మ‌న కంటికి క‌నిపించే దానికి మించిన ఎంతో లోతైన క‌థ దాగి ఉంటుంద‌ని మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఈ చెట్టు (Water Tree) కేవ‌లం నీటి నిల్వ‌కే ప‌రిమితం కాదు. దీని క‌ల‌ప ఎంతో గ‌ట్టిగా ఉంటుంది. దీని క‌ల‌ప‌ను ఫ‌ర్నీచ‌ర్‌, ప‌డ‌వ‌లు, రైల్వే స్లీప‌ర్ల త‌యారీలో విస్తృతంగా ఉప‌యోగిస్తారు. అంతే కాకుండా ఈ చెట్టు బెర‌డు డ‌యేరియా, అల్స‌ర్లు, చ‌ర్మ గాయాల నివార‌ణ‌కు అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. దీని ఆకులు ప‌ట్టు పురుగుల‌కు ప్ర‌ధాన ఆహారంగా కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చెట్టు బెర‌డు నుంచి బ‌ట్ట‌ల‌కు వేసే స‌హ‌జ సిద్ధ‌మైన రంగుల‌ను కూడా త‌యారు చేస్తారు. ఈ విధంగా టెర్మినాలియా టోమెంటోసా చెట్టు వాణిజ్యపరంగా, వైద్యపరంగా ఎంతో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది.

Read Also: తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>