కలం, వెబ్‌డెస్క్: వాచీ కేవలం సమయాన్ని చూపించే పరికరం మాత్రమే కాదు. అది మానవ జీవితంలో అత్యంత విలువైన “సమయ పాలన” (Punctuality), క్రమశిక్షణకు ప్రతీక. పురాతన కాలంలో మనుషులు సూర్యుడు, నీడ, ఇసుక గడియారాల ఆధారంగా సమయాన్ని అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు వాటి అవసరం లేకుండా మనం గడియారాలను ధరిస్తున్నాం (Wearing Watches). ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాచీని ధరిస్తారు. ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు, ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా ఖచ్చితంగా వాచీని ధరిస్తారు. అయితే వందలో 90 శాతం మంది ప్రజలు వాచ్‌ను ఎడమ చేతికి ధరిస్తారు. ఎందుకు అందరూ వాచ్‌ను ఎడమ చేతికి ధరిస్తారు? ఒకవేళ కుడి చేతికి వాచ్ ధరిస్తే ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనక పెద్ద యుద్ధ చరిత్ర, మానవ స్వభావం, విజ్ఞాన శాస్త్ర తర్కం ఉన్నాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం.
గతంలో పురుషులు తమ కోటు జేబుల్లో ‘పాకెట్ వాచీలు’ అని పిలవబడే గడియారాలను ధరించేవారట. అయితే మహిళలు మాత్రం వాటిని మెడలో లాకెట్టులాగా లేదా మణికట్టుకు ఆభరణంగా ధరించేవారు. అయినప్పటికీ 20వ శతాబ్దం ప్రారంభంలో యుద్ధ సమయంలో, సైనికులకు కచ్చితమైన సమయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉండేది. యుద్ధభూమిలో సమయం చూసుకోవడానికి జేబులోంచి గడియారాన్ని బయటకు తీయడం ప్రమాదకరంగా, అసౌకర్యంగా మారింది. అందుకే సైనికులు తమ మణికట్టుకు గడియారాలు ధరించడం ప్రారంభించారు.
సాధారణంగా చాలామంది సైనికులు ఆయుధాలు ప్రయోగించడానికి తమ కుడి చేతిని ఉపయోగించేవారు కాబట్టి.. వీరు సమయం చూసుకోవడానికి ఆయుధాలు తీయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు తమ ఎడమ చేతికి వాచ్ ధరించేవారు. మనం రాయడానికి, బరువైన వస్తువులను ఎత్తడానికి, సాంకేతిక పనులు చేయడానికి మన కుడి చేతిని ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాంటప్పుడు కుడి చేతికి గడియారం పెట్టుకుంటే పని చేసే క్రమంలో అది దేనికైనా తగిలి, అద్దం పగిలిపోయే లేదా గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడమ చేయి సాపేక్షంగా తక్కువ చురుకుగా ఉంటుంది. అందువల్ల ఖరీదైన గడియారం పాడవకుండా ఉండేదుకు ఎడమ చేయికి వాడటం అలవాటుగా మారింది.
అనలాగ్ వాచీలలో సమయాన్ని మార్చడానికి లేదా కీని సెట్ చేయడానికి ‘క్రౌన్’ అనే ఒక చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ వాచ్ డయల్‌కు కుడి వైపున ఉంటుంది. వాచ్‌ను ఎడమ చేతికి ధరించినప్పుడు, కుడి చేతి బొటనవేలి, చూపుడు వేలితో సమయాన్ని సెట్ చేయడం చాలా సులభం. వాచ్‌ను కుడి చేతికి ధరిస్తే, ఈ బటన్ ఎడమ వైపున ఉంటుంది. సమయాన్ని సెట్ చేయడం కష్టంగా ఉంటుంది. నేటి డిజిటల్, స్మార్ట్‌వాచ్ యుగంలో కీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోండి.. అయితే హృదయ స్పందనలు, ఇతర లక్షణాలను కొలిచే సెన్సార్లు ఎడమ చేతిపై మరింత కచ్చితంగా పనిచేసే విధంగా రూపొందించబడ్డాయి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా కుడి చేయి మౌస్‌తో పనిలో నిమగ్నమై ఉండగా ఎడమ చేతితో నోటిఫికేషన్‌లను స్మార్ట్ వాచ్‌లో ఒక్క చూపులో చూడటం సులభంగా ఉంటుంది.
Read Also: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Follow Us On: Sharechat

