కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కరువు, కాటకాలకు పర్యాయపదంగా మారిన పాలమూరులో బీడు వారిన పొలాల్లో కృష్ణమ్మ నీటిని పారించి పచ్చని మాగానిగా మారుస్తామని పోరాటాలు చేసిన నేతల వాగ్దానాలు పూర్తి కావడానికి మరో పోరాటం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. తెలంగాణ ఉద్యమం ఆధ్యాంతం నీళ్లు, నిధులు, నియామకాలంటూ సాగిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఉద్యమ కాలంలోనే పాలమూరు రంగారెడ్డి – ప్రాజెక్టు (Palamuru project) కు రూపకల్పన చేసిన కేసీఆర్ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ 35.250 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు ఇందులో కొల్లాపూర్ నియోజక వర్గం నార్లాపూర్ నుంచి షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి వరకు మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వర్షాకాలంలో 90 టీఎంసీల వరద జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ లో నార్లాపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేందుకు పథకాన్ని రూపొందించారు.
నిర్లక్ష్యం ఎవరిదైనా పెరిగిన అంచనాలు..
గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పనులు పూర్తి చేయకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం రూ.85 వేల కోట్లు అవసరం. గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90శాతం పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాలువల నిర్మాణం కోసం 33 వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీ కింద 4.111 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా నార్లాపూర్ నుండి మొదటి పంప్ హౌస్ కేసీఆర్ ప్రారంభించారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనీ, ఎన్నికల తర్వాత పనులు పూర్తి చేస్తామని ఆశించి భంగపడ్డారు. దీంతో పనులు నత్త నడకన సాగాయి. కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించి రాబోయే 30 మాసాల్లో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని అందిస్తామని అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అయినా అంత వేగంగా పనులు జరగటం లేదనేది బిఆర్ఎస్ నేతల ఆరోపణ.
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పాదయాత్రలు..
బిఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు నార్లాపూర్ నుండి పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రులు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 90 శాతం పనులు పూర్తయినాయని చెబుతున్న నేతలు ఒక్క ఎకరానికైనా ఎక్కడైనా నీరందించారా? అంటూ ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బిఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే అక్కసుతో రోడ్లపైకి వస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

