కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట (TGSRTC Strike) పట్టడంతో రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తమ 32 డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు అర్ధరాత్రి నుంచే విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో బస్సులు లోపలే నిలిచిపోయాయి. ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ పట్టు వీడటం లేదు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు వారాల సమయం కోరగా, అందుకు జేఏసీ ససేమిరా అనడంతో సమ్మె అనివార్యమైంది.
ప్రయాణికుల అవస్థలు..
సమ్మె ప్రభావంతో ఉదయం నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌ల వద్ద రద్దీ పెరగడంతో, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అద్దె బస్సులను జేఏసీ నాయకులు అడ్డుకోకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది.
ప్రైవేటు దోపిడీ..
జిల్లా కేంద్రాల్లోనూ సమ్మె (TGSRTC Strike) ప్రభావం తీవ్రంగా ఉంది. మంచిర్యాల డిపోలో 142 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నిన్నటి చర్చలు విఫలమైనప్పటికీ, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈరోజు మరోసారి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also: క్రాస్ రోడ్స్ లో కాళేశ్వరం.. BRS లో టెన్షన్..
Follow Us On: WhatsApp

