కలం, తెలంగాణ బ్యూరో : భూ వివాదాల పరిష్కారంలో సరికొత్త అధ్యాయం రూపుదిద్దుకున్నది. ఖమ్మం జిల్లా కూసుమంచి (Kusumanchi) మండలంలోని గట్టుసింగారం గ్రామంలో సర్వే మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ నమోదైంది. దీనితో పాటే భూధార్ నెంబర్ (Bhudhar Number) కూడా కేటాయించారు రెవెన్యూ అధికారులు. ఈ నూతన విధానంతో భూమి హక్కులకు శాశ్వత భరోసా లభించినట్లయిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు జీవితం భూమితో ముడిపడి ఉంటుందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే జీవితం భద్రంగా ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించినపుడు రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
భూభారతి పోర్టల్ ద్వారా సమగ్ర విధానం :
ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ద్వారానే భూధార్ నెంబర్, సర్వే మ్యాప్ సాధ్యమైందని మంత్రి అన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కుసుమంచి, కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను భూభారతి చట్టంలో పొందుపరిచామని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామన్నారు. సర్వేమ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ విధానంతో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గట్టుసింగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 156/ఇ/1 లోని 1.04 ఎకరాల భూమిని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయిస్తున్న సందర్భంగా భూమి హద్దులతో కూడిన మ్యాప్‌ను జతచేసి కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. భూ కమత పటాన్ని, భూధార్ నెంబర్ (Bhudhar Number) 795GCHDCUPJ7H0 ను తహశీల్దార్ కేటాయించారు. ఈ విధానాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. సర్వే విషయంలోనూ పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే చేయిస్తున్నట్లు వివరించారు.
Read Also: ఆర్టీసీ సమ్మెపై కూనంనేని కీలక వ్యాఖ్యలు
Follow Us On: WhatsApp

