కలం, నిర్మల్: టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. గుర్తింపు సంఘాల ఎన్నికలకు కార్మిక శాఖ షెడ్యూల్ ప్రకటించడంతో మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ (Adilabad Region) పరిధిలోని డిపోల్లో కార్మిక సంఘాలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. డిపో మీటింగ్‌లు, గేట్ మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీతో ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి.
పదేళ్ల తర్వాత మళ్లీ..
టీజీఎస్ ఆర్టీసీలో చివరిసారిగా 2016 అక్టోబర్ 9న గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిగాయి. అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీల్లో గుర్తింపు సంఘాల ఎన్నికలు కూడా ఉండటంతో తాజాగా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
2,200 మందికి ఓటు హక్కు..
ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో నిర్మల్, బైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో సుమారు 2,200 మంది ఉద్యోగులు ఓటు హక్కు కలిగివున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, గ్రేడ్-3 వరకు ఉన్న ఉద్యోగులు రాష్ట్రస్థాయి, డిపోస్థాయిలో వేర్వేరుగా ఓటు వేయనున్నారు.
అక్టోబర్ 9న పోలింగ్.. 17న ఓట్ల లెక్కింపు..
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 24న జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 25న పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 26న పోటీ చేసే కార్మిక సంఘాలకు గుర్తుల కేటాయింపుపై సమావేశం నిర్వహించనున్నారు. 29న డిప్యూటీ ఎన్నికల అధికారుల సమక్షంలో డమ్మీ బ్యాలెట్ పత్రాలు అందజేయనున్నారు. అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ఉంటుంది. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. డిపో స్థాయిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర పదవులతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ గుర్తింపు సంఘం ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
పోటీకి సిద్ధమైన సంఘాలు..
ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) తదితర సంఘాలు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. తమ మేనిఫెస్టోలు, ప్రధాన డిమాండ్లను ఉద్యోగుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి.
రెండు సంఘాల మధ్య హోరాహోరీ?
ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్‌లో ప్రధానంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) మధ్య పోటీపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించగా, కొన్ని డిపోల్లో ఎంప్లాయిస్ యూనియన్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఈసారి కూడా రెండు సంఘాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి.
సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం కీలకం
గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం ద్వారా ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సిబ్బంది సమస్యలు, ఆర్టీసీ పరిరక్షణ తదితర అంశాలపై తమ సంఘాల తరఫున పోరాడుతామని చెబుతున్నారు. ఇప్పటికే పలు డిపోల్లో కార్మిక సంఘాల నాయకులు గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోలను ఉద్యోగులకు వివరిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈసారి గుర్తింపు సంఘం పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆర్టీసీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

