కలం, కారేపల్లి : ఇటీవల సంభవించిన మురసు తుఫాన్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సింగరేణి మండలం ఎర్రబోడు (Yerrabodu) గ్రామానికి చెందిన రైతు కురుసం శ్రీను సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలవాలడంతో తీవ్రంగా నష్టపోయాడు. నవంబర్ చివరి నాటికి కోతకు వచ్చే విధంగా ఉన్న పంట ఒక్కసారిగా నేలకొరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
పంటను కాపాడుకునేందుకు రైతు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, దుక్కి దున్నడం తదితర ఖర్చుల కోసం ఎకరానికి సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టానని, అదికూడా అప్పులు చేసి సాగు చేశానని వాపోయాడు. వ్యవసాయ అధికారులు తన పంటతో పాటు మండలంలోని ఇతర రైతుల పంటలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరాడు.
ఈ సందర్భంగా సిపిఎం సింగరేణి మండల కార్యదర్శి కే. నరేంద్ర మాట్లాడుతూ మురసు తుఫాన్ కారణంగా వరి, మిర్చి తదితర పంటలు నష్టపోయిన రైతులను వ్యవసాయ అధికారులు వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటలను అకాల తుఫాన్ దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, రైతు కుటుంబాల జీవనోపాధికి 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోకపోతే బాధిత రైతులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని కే. నరేంద్ర హెచ్చరించారు.

