కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన (Karimnagar Ganesh Immersion) వేడుకలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనరేట్ కలసి పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra), పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రధాన నిమజ్జన కేంద్రాలైన కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్‌లలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలన సందర్భంగా అధికారులకు కలెక్టర్, సీపీ (CP Gaush Alam) ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రేన్లు, బారికేడింగ్, రాత్రి వేళ విద్యుత్ దీపాలు (లైటింగ్), పరిశుభ్రత సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక నిమజ్జన పాయింట్లు..
కొత్తపల్లి చెరువు వద్ద చిన్న ప్రతిమల కోసం రెండో పాయింట్‌ను కేటాయించారు. రక్షణ చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లు (స్విమ్మర్లు), డీఆర్‌ఎఫ్ (DRF) రెస్క్యూ బోట్లను రంగంలోకి దించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,100 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి (మానకొండూర్ చెరువు వద్ద 50%, చింతకుంట కెనాల్ వద్ద 30%, కొత్తపల్లి వద్ద 20%). 850 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రూఫ్‌టాప్ పార్టీలు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను మోహరించారు.
భారీ వాహనాలలో జగిత్యాల, హుజూరాబాద్, సిరిసిల్ల వైపు నుండి వచ్చే గ్రానైట్ లారీలు మరియు భారీ వాహనాలకు నగరంలోకి ప్రవేశం లేదు. జగిత్యాల వైపు వాహనాలు వెలిచాల క్రాస్ రోడ్ మీదుగా, హుజూరాబాద్ వైపు వాహనాలు మానకొండూర్ హైవే నుండి దుర్షేడ్ మీదుగా మళ్లిస్తారు. నగర పరిధి లో నగరంలోని గాంధీచౌక్, టవర్ సర్కిల్, కమాన్, కేబుల్ బ్రిడ్జి తదితర రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కొత్తపల్లి వద్ద వన్-వే విధానం వర్తిస్తుంది.
డీజే (DJ) శబ్ద తీవ్రత విషయంలో నిబంధనలు పాటించాలని, ఆసుపత్రులు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీపీ కోరారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రజలు, భక్తులు పోలీసుల సూచనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

