కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక బౌద్ధ కేంద్రం బుద్ధ వనములో (Buddhavanam) ఈ నెల 9న సోమవారం దమ్మ దీపోత్సవ (Dhamma Deepotsavam) వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌతమ బుద్ధుడు, బౌద్ధ బిక్షువులు మూడు నెలల తమ వస్సా వాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అశ్విజ అమావాస్య రోజున ప్రజలకు తన బోధనలను వినిపించడానికి వస్తున్న తరుణంలో ప్రజలు దీపాలతో స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకొని అదే రోజున దమ్మ దీపోత్సవముగా బౌద్ధాభిమానులు వేడుకలు జరుపుకుంటారు.
దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన బుద్ధవనములో నిర్వహించే దమ్మ దీపోత్సవ (Dhamma Deepotsavam) కార్యక్రమానికి ఇఫ్లూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంతోష్ రావత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలలో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు బౌద్ధ అభిమానులు, ప్రజలు జ్యోతులతో బుద్ధవనం ప్రధాన ద్వారం వద్ద ఉన్న అశోక ధర్మ చక్రం నుండి దీపాలతో ర్యాలీ నిర్వహించి బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తారు.
అనంతరం మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో దీపాలతో పరిక్రమ నిర్వహించిన అనంతరం బుద్ధ జ్యోతులను వెలిగిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు బౌద్ధాభిమానులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని బుద్దవనం అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. బుద్ధ వనములో దమ్మ దీపోత్సవం సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు.
Also Read : ఎమర్జెన్సీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

