కలం, నిర్మల్ : అసలే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం (CMR Rice) బకాయిలు.. వాటిపై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్న వేళ.. ఇప్పుడు కొత్త డిమాండ్ల పేరుతో రైస్ మిల్లర్లు (Nirmal Rice Millers) రంగంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం గడువులోగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కొందరు మిల్లర్లు.. తమకు నష్టం వస్తోందంటూ నిబంధనలు సడలించాలని కోరడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2022 నుంచి ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ కింద మిల్లులకు కేటాయించిన ధాన్యానికి సంబంధించి పెద్ద మొత్తంలో బియ్యం ప్రభుత్వానికి చేరాల్సి ఉన్నట్లు అధికారిక వ్యవస్థలో నమోదైన బకాయిలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ విభాగాల తనిఖీలతో కొన్ని మిల్లుల్లో నిల్వలు, సీఎంఆర్ బియ్యం వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నిర్మల్, బైంసా, ఖానాపూర్, లోకేశ్వరం తదితర ప్రాంతాల్లో జరిగిన తనిఖీల నేపథ్యంలో భారీ మొత్తంలో సీఎంఆర్ బియ్యం గల్లంతైనట్లు ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. అయితే సీఎంఆర్ బకాయిలను ముందుగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. కొందరు మిల్లర్లు (Nirmal Rice Millers) ఇప్పుడు తమ సమస్యల పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అధికారుల రాకతో తాళాలు..!
కొన్ని మిల్లుల్లో అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో యాజమాన్యాలు అందుబాటులో లేకపోవడం, మిల్లులకు తాళాలు వేసి ఉండటం వంటి ఘటనలు గతంలో చర్చకు వచ్చాయి. మరికొందరు రాజకీయ పలుకుబడి, పైరవీలతో వ్యవహారాలను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మిల్లర్ల సంఘం పేరుతో అధికారులను కలుస్తూ డిమాండ్లు వినిపించడం కూడా ఈ నేపథ్యంలోనే అనుమానాలకు తావిస్తోంది.
అసలు వడ్లే లేకపోతే.. ఉత్పత్తి ఎలా?
తాజాగా మిల్లర్ల సంఘం సమావేశమై తమ డిమాండ్ల సాధన కోసం రైస్‌మిల్లుల్లో ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించి ఈ నెల 10న అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. మిల్లుల్లో ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ ధాన్యం, బియ్యం ప్రక్రియే పెండింగ్ లో ఉంటే.. ప్రస్తుతం ఏ ఉత్పత్తి నిలిపివేస్తారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రాసెసింగ్ విధానంలో ప్రభుత్వ నిబంధనలు తమకు నష్టం కలిగిస్తున్నాయని మిల్లర్లు చెబుతున్నట్లయితే.. ఈ సమస్యను ఇంతకాలం ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదన్నది కూడా ప్రశ్నార్థకమే. ప్రభుత్వం సీఎంఆర్ బకాయిలపై దృష్టి సారించి తనిఖీలు, రికవరీ చర్యలను వేగవంతం చేస్తున్న సమయంలోనే కొత్త డిమాండ్లు తెరపైకి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న చర్చ సాగుతోంది.
బకాయిల వ్యవహారంపై సమాధానం చెప్పకుండా.. కొత్త సమస్యలను ముందుకు తెచ్చి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మిల్లర్ల సంఘంలోని కొందరు వ్యక్తులు అధికారుల పేర్లు చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత.. ఎవరెవరు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు.. అధికారులకు ఇందులో ఏమైనా సంబంధం ఉందా అన్నది జిల్లా యంత్రాంగం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.
ఇకనైనా కొరడా ఝళిపించాలి..
ప్రభుత్వానికి చేరాల్సిన సీఎంఆర్ బియ్యం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బకాయిలు ఉన్న ప్రతి మిల్లుపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, రికార్డులు, భౌతిక నిల్వలను సరిపోల్చి, లోటుపాట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

