వామ్మో ఆర్టీసీ బస్సు..! చక్రాల కింద నలిగిపోతున్న ప్రయాణికులు

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని ఆర్టీసీ బస్సులు యమపాశాల కంటే డేంజర్‌గా మారాయి. ప్రయాణికుల అజాగ్రత్తో.. డ్రైవర్ల నిర్లక్ష్యమో.. గానీ ఇటీవల ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లపై విపరీతమైన ప్రెజర్ ఉండడమూ ప్రమాదాలకు ఓ కారణమని చెప్పాలి. అయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ రూపురేఖలు మారిపోయాయి. ప్రయాణికుల సంఖ్య పెరగడం ఒక ఎత్తయితే.. ఆ రద్దీని తట్టుకోవడంలో సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదాలు ఆర్టీసీలోని అంతర్గత సమస్యలను తెరపైకి తెచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గతంలో 65 శాతం నుంచి 70శాతం ఉంటే.. ఇప్పుడు అది 100 శాతం దాటి 115శాతం వరకు చేరుతోంది. దీంతో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్ల డ్రైవర్లకు సైడ్ మిర్రర్స్ చూడడం.. వెనుక వచ్చే వాహనాలను గమనించడం కష్టమవుతోంది. బస్సు రాగానే ఎక్కాలనే ఆత్రుతతో మహిళా ప్రయాణికులు బస్సు కదలకు ముందే ఎక్కడానికి ప్రయత్నించడం, ప్లాట్‌ఫారమ్‌ల వద్ద రద్దీ వల్ల ప్రమాదవశాత్తు బస్సు కింద పడటం వంటివి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆర్టీసీలోకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు నిశ్శబ్దంగా రావడం వల్ల పాదచారులు గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారు.

ఉమ్మడి నల్లగొండలో ఇటీవల ఆర్టీసీ బస్సు ప్రమాదాలు..

గత కొన్ని నెలలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల నల్లగొండ బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పూర్తిగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పిదమేనని సీసీ టీవీ పుటేజీల్లో రికార్డు అయినట్టు తెలుస్తోంది. అంతకుముందు మిర్యాలగూడ బస్టాండులోనే ఓ మహిళా ప్రయాణికురాలిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె వెంట ఉన్న బాలుడు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. తాజాగా యాదగిరిగుట్టపైన ఆలయ బస్టాండు ప్రాంగణంలోనూ మహిళా భక్తురాలి కాలిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు కోకొల్లలు. ఇందులో కొంత ప్రయాణికుల తప్పిదం ఉంటే.. మెజార్టీ కేసుల్లో డ్రైవర్లపై ఒత్తిడినే కారణమని తెలుస్తోంది.

ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లపై ఫుల్ ప్రెజర్..

మరోవైపు ఆర్టీసీ లాభాల్లోకి రావాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు డిపోల వారీగా కఠినమైన టార్గెట్లు విధిస్తున్నారు. ప్రతి ట్రిప్పును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, లేకపోతే ‘మెమోలు’ ఇస్తామని హెచ్చరించడం వల్ల డ్రైవర్లు అతివేగంగా వెళ్లాల్సి వస్తోంది. డీజిల్ ఆదా కోసం డ్రైవర్లపై ఒత్తిడి పెరగడం వల్ల వారు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లే డబుల్ డ్యూటీలు (12 నుండి 15 గంటలు) చేయాల్సి వస్తోంది. రోజువారీగా నిర్దేశిస్తున్న ట్రిప్పులను సకాలంలో కంప్లీట్ చేయాలనో.. లేట్ అవుతుందనే ఉద్దేశంతో డ్రైవర్లు ప్రతి ట్రిప్పులోనూ గమ్యస్థానానికి చేరుకునేందుకు వేగంగా నడిపేందుకు ప్రయత్నిస్తుంటారు.

అలా చేయకపోతే.. ఎన్ని గంటలైనా సరే.. నిర్దేశిత ట్రిప్పులను కంప్లీట్ చేస్తే డ్యూటీ పూర్తి అవుతుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారుల నుంచి డ్రైవర్లు, కండక్టర్లపై విపరీతమైన ప్రెజర్ చేస్తున్నారు. దీంతో వేగంగా ట్రిప్పులు కంప్లీట్ చేసుకునేందుకు సిబ్బందిలో షరామాములగానే తొందర పాటు కన్పిస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులతోనూ కొన్నిసార్లు ర్యాష్‌గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఫలితంగా అక్కడక్కడా బస్సుల్లో ఘర్షణ వాతావరణం కన్పిస్తోంది. ఇదీగాక అదనపు గంటలు పనిచేసినా దానికి సంబంధించిన బకాయిలు పక్కదారి పడుతుండడం వల్ల సిబ్బందిలో నైరాశ్యం పెరుగుతోంది. ఇది వారి పనితీరుపై ప్రభావం చూపుతోంది. రద్దీ పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా కొత్త బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>