అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : కర్ణాటక (Karnataka) ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ సర్కార్ కూడా హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill) తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కసరత్తు చేసింది. కర్ణాటక అసెంబ్లీ గతేడాది డిసెంబరులో ఆమోదించిన బిల్లును అధ్యయనం చేసింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అశాంతికి కారణమవడం.. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, కేంద్ర ఐటీ యాక్టులోని పలు సెక్షన్లకు అనుగుణంగా ఈ చట్టం రూపొందింది. ఉల్లంఘించినవారికి జరిమానా, జైలు శిక్ష తదితరాలపైనా స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో సోమవారం సాయంత్రం జరిగే క్యాబినెట్ భేటీలో చర్చ అనంతరం క్లారిటీ రానున్నది.

ఈ సెషన్‌లోనే అసెంబ్లీలోకి బిల్లు :

విద్వేషకరమైన ప్రసంగాలు చేసే చర్యలకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లును (Hate Speech Bill) రూపొందిస్తున్నది. ఈ బిల్లు గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రస్తావించారు. గతేడాది క్రిస్మస్ సందర్భంగా, గత నెలలో జరిగిన జామియత్ ఉలేమా ఏ హింద్ సమావేశంలో హేట్ స్పీచ్ బిల్లు ఆవశ్యకతను పేర్కొన్నారు. మతాలను లేదా వర్గాలను కించపరిచేలా మాట్లాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ చట్టం తరహాలోనే తెలంగాణలోనూ బిల్లు పెడతామన్నారు. విద్వేషాలను సృష్టించే సోషల్ మీడియా పోస్టుల్ని తొలగించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. శాంతిభద్రతలు సంతృప్తికరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్వేషాలతో ప్రగతి కుంటుపడుతుందన్నది సీఎం ఉద్దేశం.

కర్ణాటక చట్టంలో శిక్షలు ఎలా ఉన్నాయి? :

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో పలు అంశాలున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే, శతృత్వం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, మనోభావాలు దెబ్బతినే, ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసే కామెంట్లు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అవి మాటలుగానైనా, రాతల్లోనైనా, సోషల్ మీడియా పోస్టుల్లోనైనా, సైగల ద్వారా, వీడియోలు/ఫొటోల ద్వారా.. ఎలా ఉన్నా ఈ చట్టం మేరకు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఉదాహరణకు కులం, మతం, వర్గం, జెండర్, అంగవైకల్యం, భాష, ప్రాంతం, నివాసం, పుట్టిన స్థలం, జాతి, షెడ్యూలు తెగలు.. ఇలా నిర్దిష్టమైన అంశాలను కర్ణాటక ప్రభుత్వం చట్టంలో పొందుపరిచింది. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే సంవత్సరానికి తగ్గకుండా (గరిష్టంగా ఏడేండ్ల వరకు) జైలుశిక్ష, రూ. 50 వేల ఫైన్, రెండోసారి రిపీట్ అయితే రెండేండ్లకు తగ్గకుండా (గరిష్టంగా పదేండ్ల వరకు) జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించొచ్చు. కాగ్నిజబుల్ నాన్-బెయిలబుల్ నేరాలు కావడంతో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పరిధిలో విచారణ జరుగుతుంది.

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>