కలం, నకిరేకల్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి, రైతులకు అవసరమైన సేవలను ఒకే వేదికపై అందించడం ద్వారానే అన్నదాతల అభ్యున్నతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ (ఏపీసీ) కె. సురేంద్ర మోహన్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా గంగాదేవిగూడెంలోని కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Kattangur FPO) ను ఆయన సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, సాగు పనులను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ఆయిల్ పామ్ కస్టమ్ హైరింగ్ సెంటర్ను ప్రారంభించారు. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయోచార్ తయారీ విధానాన్ని పరిశీలించడంతో పాటు స్వచ్ఛ శక్తి బ్యాటరీ వ్యవస్థను ప్రారంభించారు. సహకార శాఖ, నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్డీసీసీబీ) ఉమ్మడి సహకారంతో 10 మంది మహిళలకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు.
కట్టంగూర్ ఎఫ్పీఓ రాష్ట్రానికే ఆదర్శం :
కట్టంగూర్ ఎఫ్పీఓ (Kattangur FPO) అందిస్తున్న సేవలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సురేంద్ర మోహన్ ప్రశంసించారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరలకే అందించడం, ఆహార శుద్ధి, కస్టమ్ హైరింగ్ సేవలు అందించడంలో ఈ సంస్థ ముందంజలో ఉందన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థను రాష్ట్రంలోనే అత్యుత్తమ కేంద్రంగా (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) తీర్చిదిద్దే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. అలాగే, రఘు ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ వ్యవసాయ సంస్థతో కట్టంగూర్ ఎఫ్పీఓ సాంకేతిక ఒప్పందం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, నల్లగొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, నాబార్డ్ డీజీఎం ఎం. వినయ్ కుమార్, కట్టంగూర్ ఎఫ్పీఓ చైర్మన్ చౌగోని సైదమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన అధికారి టి. శేఖర్, జిల్లా సహకార అధికారి షాలిని, తహసీల్దార్ పుష్పలత, ఎన్డీసీసీబీ సీఈఓ ఆర్. శంకర్ రావు, ఎఫ్పీఓ మెంటార్ రావుల విద్యాసాగర్, ఏడీఏ విజయేందర్ రెడ్డి, ఏఓ గిరిబాబు, కార్బన్ మింట్ రైస్ 360 ఎండీ వెంకట్ రెడ్డి, స్వచ్ఛ శక్తి బ్యాటరీస్ ప్రతినిధి సుధాకర్, తపోవనం బయోచార్ ఎండీ హాసన్ చైతన్య, ఎఫ్పీఓ సీఈఓ జె. రమేష్, ఉద్యాన అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

