కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం పీసీ.ఘోష్ ఆధ్వర్యంలో నియమించిన కాళేశ్వరం కమిషన్ పై (Kaleshwaram Commission) రేపు హైకోర్ట్ కీలక తీర్పు వెలువరించబోతుంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని.. రిపోర్ట్ ఏకపక్షంగా ఉందంటూ కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్ట్.. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలుమార్లు వీటిని పొడిగిస్తూ వచ్చిన ధర్మాసనం.. రేపు తుది తీర్పు ఇవ్వనుండటంతో ఉత్కంఠ నెలకొంది. కోర్ట్ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే.. సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు నిన్న దిల్లీకి వెళ్లి లాయర్ ఆర్యమా సుందరంతో భేటీ అయ్యారు.
కమిషన్ రిపోర్టులో ఏమున్నదంటే..!
మేడిగడ్డ బ్యారేజీలో (Medigadda Barrage) లోపాలకు కేసీఆర్ ప్రధాన కారణమని, ఆయన ఆదేశాల మేరకు అప్పటి ఇంజినీర్లు పనిచేశారని పీసీ.ఘోష్ కమిషన్ (Kaleshwaram Commission) రిపోర్టులో పేర్కొంది. ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ వంటి అన్ని దశల్లో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడిగా పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా, కీలకమైన నిర్ణయాలను ఆయన ఒక్కడే తీసుకున్నారని ఆరోపించింది. అలాగే, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో నిపుణుల సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోలేదని వివరించింది. ఈ మొత్తం ప్రాజెక్టు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడిందని, భవిష్యత్తులో గుది బండగా మారబోతుందని హెచ్చరించింది.
కేసీఆర్ వాదన ఇది..!
మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలకు తనను బాధ్యుడిగా చేయాలన్న కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. పీసీ.ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. అంతేగాకుండా, కమిషన్ కు కేవలం నిజనిజాలు తేల్చే అధికారం ఉంటుందని.. అంతే తప్ప, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు.. అతడిని ప్రాసిక్యూట్ చేయాలని సిఫార్సు చేసే అధికారం లేదని పేర్కొన్నారు. కమిషన్ తన పరిధి దాటి వ్యవహరించినందున.. ఆ రిపోర్టును కొట్టేయడంతో పాటు కమిషన్ ఏర్పాటును కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు. దీనిపైనే, రేపు కోర్ట్ తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Read Also: కేరళ ఘటన.. ప్రధాని మోదీ దిగ్భాంతి
Follow Us On: Instagram

