Karimnagar | చేవెళ్ల రోడ్డు ప్రమాదఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలు ఆర్తనాథాలు మిన్నంటుతున్నాయి. అనేక కుటుంబాలు ఈ ఘటనతో రోడ్డున పడ్డాయి. తల్లులను పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, భర్తలను పోగొట్టుకున్న భార్యలు, భార్యలకు దూరమైన భర్తలు. ఇలా ఈ ఘటన రాష్ట్రంలో పెను విషాదం నింపింది. ఎందరో కన్నీటికి కారణమైంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 19 మంది గాయాలపాలయ్యారు.
కరీంనగర్(Karimnagar), నల్గొండ(Nalgonda) జిల్లాల్లో మంగళవారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని హడలెత్తించాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి సమీపంలో మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన ఉదయం 5 గంటలకు ముందు చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు తక్షణమే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: యువతిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల కాల్పులు
Follow Us On : Instagram

