కలం, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్‌వీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థి నాయకులు ఆందోళనల్లో పాల్గొనకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్‌వి, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు అరెస్టులలో భాగంగా బీఆర్ఎస్‌వి రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాసిం, బీఆర్ఎస్ మైనారిటీ యూత్ నాయకుడు ఒవైజ్ షా, టీఆర్ఎస్‌వి నాయకులు చందన్, శోభి, పాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని భావిస్తే, ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అణచివేతకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. “విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఇలా విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది.” అని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకొచ్చారు.
ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని బీఆర్ఎస్‌వి రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాసిం, ఒవైజ్ షా స్పష్టం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

