కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో (Karimnagar) రాజకీయ సెగలు రాజుకున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో నగరం ఒక్కసారిగా రణక్షేత్రాన్ని తలపించింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులకు ప్రతిగా శనివారం బీఆర్ఎస్ నగర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం జరిగిన దాడులకు నిరసనగా బీఆర్ఎస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని కోరారు.
కేటీఆర్ పర్యటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదివారం కరీంనగర్‌లో (Karimnagar) పర్యటించనున్నారు. దాడికి గురైన ఎమ్మెల్యేలను పరామర్శించనున్నారు. కేటీఆర్ రాకతో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడుల వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హస్తం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన నివాసం నుంచే వ్యూహరచన జరిగిందని, సీసీ కెమెరా దృశ్యాలు దీనికి సాక్ష్యమని గంగుల కమలాకర్ (Gangula Kamalakar) వంటి నేతలు మండిపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని ఆంక్షలు పెట్టారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు.
ముదిరిన వివాదం
డ్రగ్ టెస్టుల సవాల్‌తో మొదలైన వివాదం.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని గులాబీ దళం తీవ్రంగా పరిగణిస్తోంది. మరోవైపు, బీజేపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది. కేటీఆర్ పర్యటన దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కూడా నిఘా పెట్టారు.
Read Also: విజయ్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
Follow Us On: WhatsApp

