Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: సీఎస్ రామకృష్ణారావు

కలం, నిజామాబాద్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఆదేశించారు. ధాన్యం కొనుగోలు (Paddy Procurement), ఫార్మర్ రిజిస్ట్రీ, జనాభా గణన, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం జరిపించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యం లోడింగ్ ఆన్ లోడింగ్‌లో జాప్యం జరగకుండా సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితుల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు.

జనాభా గణన (Census) ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న స్వీయ నమోదును అన్ని వర్గాల వారు స్వీయ గణన చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు జిల్లాలో అత్యధిక మంది స్వీయ గణన పూర్తి చేసుకునేలా చొరవ చూపాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు.

ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో వంద శాతం పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీఓ సాయన్న, డీఏఓ వీరస్వామి, డీఈఓ అశోక్, డీసీఓ శ్రీనివాస్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also:  విజయ్ అనే నేను.. సీఎం‌గా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>