కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంఘీభావంగా సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్న ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డాడు. వారిని అడ్డుకోబోయిన స్థానిక పోలీస్ సిబ్బందిని సైతం కొట్టడంతో వారికీ గాయాలయ్యాయి. ఈడీ అధికారుల కారును కూడా ధ్వంసం చేశారు. దురుద్దేశపూర్వకంగానే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం పినరయి విజయన్‌పై కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈడీ కోరిక నెరవేరందునుకుంటున్నా: పినరయి విజయన్
ఈడీ సోదాలపై పినరయి విజయన్ స్పందించారు. ‘నా ఇంటిని తనిఖీ చేయాలనేది ఈడీ ఎంతో కాలంగా కోరుకుంటోంది. ఈ రోజుకు అది నెరవేరిందని భావిస్తున్నా. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఇంకా సంతోషంగా ఉండి ఉంటుంది. ఎందుకంటే, ఆయన చాలా సార్లు విజయన్ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగవు, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బలమైన గొంతులు వినిపించే ప్రతిపక్ష నేతలపై బీజేపీ ఈడీతో ఎలా దాడులు చేయిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. ఆరంభం మాత్రమే. నా పట్ల కార్యకర్తలకు సానుభూతి ఉంది. నాపై శత్రువులు దాడి చేయాలని చూస్తే.. వారి నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురవుతుంటుంది. అదే ఈ రోజు కార్యకర్తలు చేశారు’ అని పేర్కొన్నారు.

