కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు గోస పడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా చెల్పూరు మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాలను బీజేపీ (BJP) రాష్ట్ర నాయకత్వంతో కలిసి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తడిచిందని క్వింటాకు 10 కేజీలు కట్ చేస్తుంటే రైతులు లబో దిబో మంటున్నారని చెప్పారు. ధాన్యం తడిసిపోవడంతో కౌలు రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పైసలు కూడ మిగిలేలా లేవని వాపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.
ధాన్యం అంతా తరలించాలి..
మంత్రులు, ఎమ్మెల్యేలు కల్లాలలోకి వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని విమర్శించారు. రైతులకు తమకు ప్రేమ ఉన్నట్లు ఇంకా బుకాయించకండి అంటూ మండిపడ్డారు. ఆనాడు సంకెళ్లు వేసిన కేసీఆర్ కు రైతులు ఎలా బుద్ధి చెప్పారో కాంగ్రెస్ నేతలకు అలాగే బుద్ది చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు అదరగొట్టడం మాని వర్షాలు పడే లోపు ఇక్కడ ఉన్న ధాన్యం అంతా తరలించాలని ఈటల హెచ్చరించారు.
రైతులు గుండెలు బాదుకుంటున్నారు..
పంట వేసిన తరువాత.. ఏ పంట ఎంత సాగు చేశారు? ఎంత దిగుబడి వస్తుంది? అని స్పష్టమైన అంచనాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉంటాయని ఈటల చెప్పారు. వాటికి అనుగుణంగా సివిల్ సప్లై శాఖ కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement) గోనె సంచులు, హమలీల ఏర్పాటు చేయాలి కానీ.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు గోస పడుతున్నారని విమర్శించారు. ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో వర్షంలో తడిచి ధాన్యం ముద్ద అవుతున్నాయని.. ఆరుగాలం పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చెల్పూర్ లో 300 లారీల ధాన్యం ఉందని.. దీనిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఎప్పుడు మిల్లులకు తరలిస్తారు? అని ప్రశ్నించారు.

