Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ రెయిడ్స్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. ఇటీవల నిత్యం ఏదో ఒక చోట అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తిస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. నగరంలోని నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్లు తదితర సేవలు ఏజెంట్ల ద్వారా అక్రమంగా జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ఏసీబీ బృందాలు బుధవారం ఉదయం కార్యాలయంపై తనిఖీలు చేపట్టాయి.

ఏసీబీ అదుపులో ఆర్టీఏ ఏజెంట్లు

దాడుల సమయంలో కార్యాలయంలో ఉన్న పలువురు ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. లైసెన్స్‌ల మంజూరు, వాహన రిజిస్ట్రేషన్లలో నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా? అక్రమ లావాదేవీలు జరిగాయా? అనే అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.

ఎంవీఐలు, ఏఎంవీఐలు సైతం

కార్యాలయంలో పనిచేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐలు) సైతం ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు. అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి విధుల నిర్వహణ, ఏజెంట్లతో సంబంధాలపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.

ఏజెంట్ల మొబైల్ ఫోన్లు సీజ్

అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసం ఏజెంట్ల మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ టెస్టులు లేకుండానే లైసెన్స్‌లు జారీ చేశారా? మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ దాడులతో నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సేవల కోసం వచ్చిన ప్రజలు ఆందోళనకు గురికాగా, కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>