Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఓటర్ల జాబితా ప్రక్షాళన.. జూన్ 25 నుంచి ‘సర్’ 

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ‘సర్’ (Telangana SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితా ప్రక్షాళనపై కీలక అడుగు వేసింది. ఇప్పటికి రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఈ ప్రక్రియ వివాదాల్లో చుట్టుకుంది. థర్డ్ ఫేజ్‌లో భాగంగా ఇప్పుడు తెలంగాణలో పూర్తి చేసేందుకు షెడ్యూలు ఫిక్స్ చేసింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరగనున్నది. ఇంటింటినీ విజిట్ చేసే బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. జూలై 31న ముసాయిదా జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను, ఫిర్యాదులను ఆహ్వానించనున్నది. నెల రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించి అక్టోబర్ 10న తుది జాబితా విడుదల చేసేలా ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు ఖరారు చేసింది. ఈ సంవత్సరం అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏండ్ల వయసు నిండేవారిని అర్హులుగా ప్రకటించేలా కటాఫ్ డేట్‌ను ఖరారు చేసింది.

ఇతర రాష్ట్రాల్లో ముసురుకున్న వివాదాలు :
ఇప్పటికే బీహార్‌లో మొదటి దశ, మరికొన్ని రాష్ట్రాల్లో రెండో దశ ‘సర్’ ప్రక్రియ పూర్తయింది. పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో భాగంగా తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నది. ఈ దశ పూర్తయితే దాదాపు దేశమంతా కంప్లీట్ అయినట్టే. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో హిమాచల్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నది. సాధారణంగా ఎన్నికల జాబితా సవరణ ప్రతీ ఏటా జరగడం ఆనవాయితీ. కానీ ‘సర్’ మరింత విస్తృతమైన ప్రక్రియ. ఇందులో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించుకుంటారు. మరణించినవారు, ఒకచోట నుంచి మరొకచోటికి మారినవారు, డబుల్ ఎంట్రీస్, తారుమారైన ఓటర్ల వివరాలను గుర్తించి సవరిస్తారు. అవసరమైతే కొత్తగా అర్హత పొందినవారి పేర్లను జాబితాలో చేరుస్తారు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు.

తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ ఇదీ :

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో ఈ ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలు ఇవి:
జూన్ 25 – జూలై 24 : ఇంటింటికీ బీఎల్ఓల సందర్శన, ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ
జూలై 24 : పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్
జూలై 31 : ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జూలై 31 – ఆగస్టు 30 : అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తుల స్వీకరణ
ఆగస్టు 31 – సెప్టెంబరు 28 : అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం
అక్టోబర్ 10 : తుది ఓటర్ లిస్ట్ రిలీజ్

Read Also: బైక్‌పై అసెంబ్లీకి దేవేంద్ర ఫడ్నవీస్.. వీడియో వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>