కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్త పర్యాటక పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. పర్యాటక రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డీపీఆర్ (DPR)లను సమర్పిస్తే, ఆలస్యం లేకుండా అనుమతులు ఇచ్చి ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM) ప్రాంగణంలో ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్” పేరిట నిర్వహించిన ప్రతిష్టాత్మక పర్యాటక సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా టూరిజం..
పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని వివరించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో భాగంగా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. నూతన పర్యాటక విధానంలో భాగంగా అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు.
కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి..
నిరర్ధకంగా ఉన్న ఆస్తులను పర్యాటక అవసరాల కోసం దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాజెక్టుల (Tourist Destinations) నిర్వహణలో ఆసక్తి గలవారు కొత్త ఆవిష్కరణలు, ప్రతిపాదనలతో రావాలని కోరారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (EOI) ప్రకటనలు జారీ చేయనుందని చెప్పారు. దీని ద్వారా ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. పర్యాటక రంగం కేవలం వినోదం మాత్రమే కాదని.. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కీలకమైన రంగమని చెప్పారు. అభివృద్ధి చెందిన చిన్న దేశాలు పర్యాటకంపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నాయన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, ప్రమోట్ చేయడం, అభివృద్ధి చేయడం మనందరి సమిష్టి బాధ్యత అని తెలిపారు.

