కలం డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ను ఒకలా.. మెగస్టార్ చిరంజీవిని మరోలా తెలంగాణ ప్రభుత్వం ట్రీట్ చేస్తున్నదంటూ ఇరు స్టార్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం (Fan War) చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రభాస్ ఫ్యాన్స్ ఎండగడుతున్నారు. చిరు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. తెలంగాణ సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘‘మా హీరో సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందు.. అదీ అర్ధరాత్రి టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రీమియర్ షోల కోసం ఎదురుచూస్తే.. ఆ ముచ్చట్నే ఎత్తలేదు. మా హీరో అంటే సీఎం రేవంత్‌కు ఎందుకంత మంట” అంటూ ‘రాజాసాబ్ (The Rajasaab)’ ఫాలోవర్స్ గరం గరం అవుతుంటే.. ‘‘హమ్మయ్యా.. మా మెగాస్టార్ (Megastar Chiranjeevi) సినిమా విడుదలకు రెండు రోజుల ముందే టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతొచ్చిందోచ్! సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్” అంటూ ‘మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara varaprasad garu)’ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
రాజాసాబ్‌కు పరీక్ష పెట్టి..!
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్స్గా తెరకెక్కిన ‘రాజాసాబ్ ’ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ ముందే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆంధ్రాలో ప్రభాస్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల 8 అర్ధరాత్రి వరకు ప్రీమియర్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై స్పందించలేదు. దీనిపై అప్పటికే రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబడ్తూ పోస్టులు పెట్టారు. చివరికి అర్ధరాత్రి 11 తర్వాత టికెట్ల రేట్ల పెంపు కోసం జీవో రిలీజ్ చేసింది. ప్రీమియర్ షోల మాటే ఎత్తలేదు. తర్వాత హైకోర్టు కేసుల నేపథ్యంలో ఆ టికెట్ రేట్ల పెంపు కూడా వాయిదా పడింది. ప్రస్తుతం సాధారణ ధరలకే నైజాంలో ‘రాజాసాబ్’ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు.
శంకర వరప్రసాద్‌ను సత్కరించి..!
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి, నయనతారకీ రోల్స్ లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఈ నెల 12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం పొలోమంటూ ప్రీమియర్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు ముందస్తుగానే అనుమతులు ఇచ్చేశాయి. ఈ నెల 9న ఏపీ ప్రభుత్వం, 10న తెలంగాణ ప్రభుత్వం జీవోలు ఇచ్చేశాయి. అంటే సినిమాకు రెండు రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ప్రీమియర్ షో, టికెట్ల రేట్ల పెంపుపై శనివారం జీవో వచ్చినప్పటి నుంచి రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ నటుడి సినిమా కోసం అర్ధరాత్రి జీవో ఇచ్చిన ప్రభుత్వం.. చిరంజీవి విషయంలో మాత్రం రెండు రోజుల ముందే స్పందించడం ఏమిటని.. తమ స్టార్ అంటే ఎందుకంత చులకన అని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘‘పండుగ చేస్కోండి శంకర వరప్రసాద్ గారూ అంటూ చిరంజీవి ఫ్యాన్స్ కు సత్కారాలు.. మాకు మాత్రం పరీక్షనా” అంటూ గరమైతున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి అభిమానులేమో సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రీమియర్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతిచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్‌కు థాంక్స్ చెప్తున్నారు.
గ్లోబల్ సమిట్ వేదికపైనే ఓకే అయిందా?
ప్రభాస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కావాలనే వివక్ష చూపుతున్నదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు (Fan War). హీరో వచ్చి కలిస్తేనే అనుమతులిస్తామన్న ధోరణిలో గవర్నమెంట్ పెద్దలు ఉన్నారని మండిపడుతున్నారు. ఆ మధ్య గ్లోబల్ సమిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవిని పిలిచి.. మాట్లాడించినప్పుడే ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఓకే అయిపోయి ఉంటాయని.. అందుకే రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే జీవో ఇచ్చారని దుయ్యబడ్తున్నారు. పైగా చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసినందుకే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తున్నదని.. ఇతర స్టార్ల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నదని ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
వీరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. ‘పుష్ప2’ (Pushpa2) అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే.. చిరంజీవి సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. అవి అమలవుతాయా అన్న సందేహాలు కూడా మెగాస్టార్ అభిమానులను వెంటాడుతున్నాయి. ‘ది రాజాసాబ్ ’ టికెట్ రేట్ల పెంపును హైకోర్టు వ్యతిరేకించడం ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి కూడా వర్తిస్తుందా? అని వారు కలవరపడ్తున్నారు.
Read Also: ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అదరగొట్టిన కార్లోస్
Follow Us On: Sharechat


