సింగరేణికే మణుగూరు కోల్ బ్లాక్.. కూనంనేని హర్షం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని పీకే ఓసి (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్) డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన కోల్ బ్లాక్ దక్కడం సింగరేణి కార్మికుల పోరాటానికి దక్కిన ఫలితమన్నారు.

పోరాటాలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం..

​ఈ సందర్భంపై కూనంనేని స్పందిస్తూ.. సింగరేణి సంస్థ పరిరక్షణ, మనుగడ కోసం కార్మికులు, ప్రజా సంఘాలు నిర్వహించిన వరుస ఆందోళనల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పలు మార్లు చర్చించినట్లు తెలిపారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు, ఆందోళనలు ఈ విజయంలో కీలక భూమిక పోషించాయని చెప్పారు.

లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి ఆస్తులను, గనులను ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు జరిగిన కుట్రలను ఉద్యమ స్పూర్తితో తిప్పికొట్టామని కూనంనేని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు దక్కే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి నిరంతరం కృషి చేస్తామని కూనంనేని పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>