కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో డ్రైవర్లు, శ్రామిక పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు తుది ఫలితాలు వెలువడ్డాయి. గత ఏడాడి సెప్టెంబర్ 17 జారీ చేసిన రిక్రూట్ నోటిఫికేషన్ లో ఉన్న 1743 ఖాళీలకు 1604 మందిని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీజీఎల్పీఆర్బీ) భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది.
ఎంపికైన అభ్యర్థులు తమ ఫలితాలను సంబంధిత అధికారిక వేదికలో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. తదుపరి దశగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు ఆగస్టు 17ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోపు అన్ని ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, గుర్తింపు పత్రాలు ఇతర అవసరమైన పత్రాలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు తెలిపారు.
గడువు దాటిన తర్వాత వచ్చే అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవచ్చని స్పష్టం చేశారు. రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో 1,743 ఖాళీల్లో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు మొత్తం 894 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, శ్రామిక పోస్టులకు 16 మంది మహిళలతో సహా 710 మంది అభ్యర్థులను బోర్డు ఎంపిక చేసింది.
అయితే, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో మొత్తం 139 పోస్టులు బ్యాక్ ల్యాగ్ లో ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు వెయిటేజ్ మార్కులు, డ్రైవింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా, శ్రామిక పోస్టులకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది.

