కలం, వెబ్ డెస్క్: జూన్ 21న నిర్వహించబోతున్న నీట్ (NEET) రీ–ఎగ్జామ్ కోసం కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష లీకేజీ కారణంగా ఓసారి రద్దు అయిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇందుకోసం పరీక్ష పేపర్లను తరలించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు ఉపయోగించబోతున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. “సాధారణంగా పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం మాకు ఆరు నెలల సమయం అవసరం. అయితే, ఈసారి ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా 37 రోజుల్లోనే పరీక్ష నిర్వహించాల్సి వస్తోంది. మా విన్నపం మేరకు కేంద్ర రక్షణ, హోం, విదేశీ, పోస్టల్ మంత్రిత్వ శాఖలు, పారామిలటరీ విభాగాలు, రాష్ట్ర ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. సాధారణంగా 15 నుంచి 20 రోజులు పట్టే ప్రక్రియ.. కేంద్రం సహకారంతో మూడు నాలుగు రోజుల్లోనే పూర్తి చేస్తున్నాం. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు ఎన్టీఏకు సహకరిస్తున్నాయి” అని తెలిపారు.
పూర్తి స్థాయి భద్రతతో పరీక్ష పేపర్ తయారీ..
పరీక్ష పేపర్ తయారీని వంద శాతం భద్రతతో చేస్తున్నట్లు NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. పలు దశలుగా సెక్యూరిటీ చెక్ జరుగుతోందన్నారు. పరీక్ష పేపర్ తయారు చేస్తున్న వారు వాటిని తర్జుమా చేయడం, ప్రింట్ చేయడం, ఎక్కడైనా స్టోర్ చేసుకునే అవకాశం కూడా లేదన్నారు. టెలిగ్రాంపై తాత్కాలిక బ్యాన్ విధించడం సమంజసమేనన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. మేం కేవలం హెచ్చరికలు చేసి వదిలిపెట్టాలని భావించడం లేదని, విద్యార్థుల కోసం ఏదీ సరైందో అది చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

