కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ (Bhogapuram Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ విమానాశ్రయ టెర్మినల్ లోపల ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలను, ప్రత్యేక ప్రదర్శనలను పరిశీలించారు. మొత్తం 2,703 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును సకల వసతులతో తీర్చిదిద్దారు. ఇందులో ప్రధాన విమానాశ్రయంతో పాటు విమానయాన హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా భాగం కానున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడేలా వివిధ శాఖలకు చెందిన దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

