కలం, వెబ్ డెస్క్: Kavitha Party Launch Date | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి పర్వదిమైన శుక్రవారం నిజామాబాద్‌లో (Nizamabad) ఆమె మీడియాతో మాట్లాడుతూ… ORR సమీపంలోని మునీరాబాద్, అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ చేసి పార్టీని లాంఛనంగా స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. అదే రోజున జెండా, ఎజెండా, పార్టీ నిబంధనలను ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరును ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని ఖరారు చేశారు. పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం, సర్వోదయం కోసం కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్న శక్తులు ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మహిళ రాజకీయ పార్టీని పెట్టడం ఇది రెండో సంఘటన. రెండేండ్ల క్రితం వైఎస్ షర్మిల తెలంగాణ వైసీపీ పేరుతో పార్టీని పెట్టడం, దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ముగిసిపోయాయి.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గరైన తర్వాత సొంత పార్టీతోనే జనంలోకి వెళ్తానని కవిత ప్రకటించారు. దానికి తగినట్లుగానే యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. ప్రజాసమస్యల మీద స్పందిస్తున్నారు. ఆమె ఇంతకాలం స్వచ్చంద సంస్థగా నిర్వహించిన జాగృతి పేరుని తన రాజకీయ పార్టీకీ అనుసంధానం చేశారు. కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఏప్రిల్ 25న పార్టీ జెండా ఊపి (Kavitha Party Launch) మరింత బలంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని భావిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థగా రైతుల కోసం, పేదల కోసం దశాబ్దానికి పైగా పనిచేసిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రాజకీయ పార్టీ రూపాన్ని సంతరించుకుంటున్నదని, అన్ని సెక్షన్ల ప్రజలు ఆదరించినట్లుగానే ఇప్పుడు రాజకీయ పార్టీగా సైతం గుండెల్లో పెట్టుకుంటారన్న ధీమాను వ్యక్తం చేశారు.
మరోవైపు కవిత తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాగృతి యూనిట్లను బలోపేతం చేస్తున్నారు. ఆమె అనుచరులు ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనం బాట పాదయాత్ర ద్వారా కవిత అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలపై ఆమె స్పందించారు. ప్రజల నుంచి కూడా కవిత పార్టీకి మంచి స్పందన వచ్చిందని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన కవిత చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కవిత దీక్ష అనంతరం ప్రభుత్వం దిగి వచ్చి బాధితులకు పట్టాలు కూడా పంపిణీ చేసింది. దీంతో కవిత కొత్తపార్టీ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
Read Also: అమెరికా చరిత్రలో తొలిసారి.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం
Follow Us On: Instagram

