కలం, వెబ్ డెస్క్: ఇంధన ధరలు (Fuel Rates) తగ్గాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఊరట లభించదని ఏఐసీసీ (AICC) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయని, కేవలం చమురు సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే ‘స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ’ని (Excise Duty) మాత్రమే తగ్గించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పన్ను తగ్గించినంత మాత్రాన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇది కేవలం ప్రచారానికే పరిమితమైందని ఆయన విమర్శించారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు సంస్థలు గత కొంతకాలంగా నష్టాలను భరిస్తున్నాయని, ఆ భారాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకుందని ఖేరా పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన ఉపశమనం కలిగించకుండా, కేవలం హెడ్‌లైన్స్ కోసం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం గతంలో 12 సార్లు ఎక్స్ఐజ్ డ్యూటీని పెంచిందని ఖేరా విమర్శించారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మానుకొని, పెట్రో ధరలను నేరుగా తగ్గించి సామాన్యులకు అసలైన ఊరటనివ్వాలని ఆయన (Pawan Khera) డిమాండ్ చేశారు.
Read Also: పార్టీ లాంచింగ్ డేట్ ప్రకటించిన కవిత
Follow Us On : WhatsApp

