కలం, వెబ్ డెస్క్ : ప్రతిష్టాత్మకమైన ‘స్మిత్సోనియన్’ మ్యాగజైన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన 23వ ఫోటోగ్రఫీ పోటీలో భారతదేశం తరపున తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన ఫోటోగ్రాఫర్ చెందిన అరుణ్ నలిమెల (Arun Nalimela) తీసిన ఫోటో ఎంపికైంది. ట్రావెల్ విభాగంలో అరుణ్ నలిమెల విజేతగా నిలిచారు. వారణాసిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు వెలిగించిన ప్రమిదల మధ్య ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని అరుణ్ తన కెమెరాలో బంధించారు. ‘సిటీ ఆఫ్ లైట్స్’ (City of Lights) అనే శీర్షికతో అరుణ్ క్లిక్ చేసిన ఈ ఫోటో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది ఎంట్రీల ప్రత్యేకంగా నిలిచి అవార్డును గెలుచుకుంది. కాగా, అవార్డు తెచ్చిన ఫోటోపై అరుణ్ మాట్లాడుతూ.. ”మనం పూర్తి భక్తితో సంస్కృతిని చిత్రీకరించినప్పుడు, కొన్ని అద్భుతమైన చిత్రాలు దానంతట అవే మనకు లభిస్తాయి. ఈ ఫోటో కూడా అలా దేవుడు ఇచ్చిన కానుక లాంటిదే”అని ఎమోషనల్ అయ్యారు.
సోదరుడి స్పూర్తితో మొదలైన ప్రయాణం
33 ఏళ్ల అరుణ్ నలిమెల 2013లో తన అన్నయ్య స్ఫూర్తితో ఫోటోగ్రఫీని హాబీగా మొదలుపెట్టారు. అరుణ్ నలిమెల మొదట్లో వన్యప్రాణుల ఫోటోలు తీసేవారు. ఆ తర్వాత తన దృష్టిని భారతీయ సంస్కృతి వైపు మళ్లించారు. ఈ కొవలోనే గతంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అరుణ్ నలిమెల ఫోటోగ్రఫీని మెచ్చుకున్నారు. తాజా అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరుణ్ నలిమెలకు ఫోటో గ్రాఫర్ల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. అరుణ్ నలిమెల తన అద్భుతమైన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని చాటారని కొనియాడుతున్నారు.

