epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మున్సి’పల్స్’.. మూడు పార్టీలకు సవాల్..!

కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ పోరు మొదలు కాబోతోంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ థర్డ్ వీక్ లోనే నోటిఫికేషన్ ఇవ్వబోతోంది ఎన్నికల సంఘం. ఈ అర్బన్ ఎన్నికలు (Municipal Elections) కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు సవాల్ గా తీసుకుంటున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేవు కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకం అయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించినా.. ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఈ మున్సిపల్ పోరులో బలమైన సత్తా చాటాలని భావిస్తోంది. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో విజయం సాధించాలని చూస్తోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.

అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారంట. ఆయా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు మున్సిపల్ పరిధుల్లో తిరుగుతున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ జిల్లాల్లో పర్యటించి, సభలు నిర్వహించారు. ఆ సభల్లో సీఎం రకరకాల హామీలు ఇస్తూ ప్రతిపక్ష బీఆర్ ఎస్, బీజేపీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ వర్తించని గ్రామాల్లో సభలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ఆ సభల్లో కీలక హామీలు గుప్పించే అవకాశాలున్నాయి. బీఆర్ ఎస్, బీజేపీల కంటే ఎక్కువ సీట్లు సాధించి అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో తమకు పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారు.

అటు బీఆర్ ఎస్ తరఫున మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మున్సిపల్ బాధ్యతలు తీసుకుంటున్నారు. గత పదేళ్లుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తానేం చేశాడో ప్రచారం చేయాలని భావిస్తున్నాడంట. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే వచ్చాయి కాబట్టి ఈ అర్బన్ ఏరియాల్లోనూ పార్టీ సత్తా చాటితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా తమకు తిరుగుండదని భావిస్తున్నారు గులాబీ నేతలు. అటు హరీష్ రావు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ మళ్లీ బాధ్యత తీసుకుంటున్న ఎన్నికలు ఇవే. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. పదేళ్లు ఇదే శాఖ మంత్రి కాబట్టి.. తాను అభివృద్ధి చేశాను కాబట్లే ప్రతిపక్షంలో ఉన్నా తన పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకోవాలని ప్లాన్ వేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఘోరమైన సీట్లు సాధించిన బీజేపీకి ఈ అర్బన్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీకి గ్రామాల్లో కంటే అర్బన్ లోనే ఎక్కువ పట్టు ఉంటుంది. దాన్ని మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అర్బన్ లో మోడీ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించాలని వ్యూహాలు రెడీ చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి అంతకంటే ఎక్కువ సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అటు బండి సంజయ్, పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి కార్పొరేషన్ల మీద ఫోకస్ పెడుతున్నారు.

ఎంపీ ధర్మపురి అరవింద్, రాకేష్ రెడ్డి లాంటి వాళ్లు నిజమాబాద్ తో పాటు మరికొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లోని కీలక నేతలు.. ఆయా మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలు తీసుకుంటున్నారంట. ఇలా అన్ని పార్టీలు ఎవరికి వారే ప్రత్యేక ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు. మరి పట్టణాలు ఎవరికి మొగ్గు చూపుతాయో.

Read Also: ‘మిస్టర్ టారిఫ్’ మహారాజ్: ఒక్క టారిఫ్‌తో వెనిజువెలా జేబులోకి, గ్రీన్‌ల్యాండ్ బ్యాగ్‌లోకి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>