కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో భూముల రీ సర్వే (Land Resurvey) ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ (DS Lokesh Kumar) అధికారులను ఆదేశించారు. భూ రీ సర్వే ప్రక్రియ, భూ భారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సీసీఎల్‌ఏ లోకేష్ కుమార్ గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ (Vinod Kumar) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు.
డీజీపీఎస్ (DGPS), రోవర్స్, జీఐఎస్ (GIS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయాలని సూచించారు. రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో విధుల్లో వినియోగించాలని తెలిపారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరును శాఖ సర్వేయర్లు నిరంతరం పర్యవేక్షించాలని, డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి 60 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని, పెండింగ్ దరఖాస్తులను అత్యంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వే సంబంధిత ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ రీసర్వే పనులు, భూ భారతి పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏవో భాను ప్రకాష్, సర్వే ఏడి శ్రీనివాసులు, రెవెన్యూ సెక్షన్స్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

