కలం, వెబ్ డెస్క్: ఏపీలో గొడ్డలి పార్టీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. గత పాలకుల అరాచకాలతో ప్రజలు కోలుకోలేని దెబ్బతిన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో గురువారం నిర్వహించిన “మీ భూమి- మీ హక్కు” పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బనగానపల్లిలో రైతులకు రాజ ముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 9,929 గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేసి 64,43 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు..
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమస్యలు, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని చెప్పారు. భూమి పట్టా పుస్తకాలపై వైసీపీ వాళ్ళ ఫోటోలు, ల్యాండ్ లో రాళ్లపై వైసీపీ వాళ్ళ పేర్లు ఉండేవని మండిపడ్డారు. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మత కలహాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. రాయల సీమలో ఫ్యాక్షన్ లేకుండా చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీదని కొనియాడారు.
రౌడీలను వైసీపీ ప్రోత్సహించింది..
ప్రజల ప్రాణాలకు, ప్రజలు ఆస్తులకు రక్షణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రమంతా డ్రగ్స్, గంజాయి పండించారని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ రౌడీలను, గంజాయి బ్యాచ్ లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. 2019లో ఆలయాలపై దాడులు జరిగాయని.. ఒక్కరిపై కూడా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో దేవాలయాలను అపవిత్రం చేశారని సీఎం మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టారని అన్నారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడని.. తీవ్రవాదులను, పాకిస్తాన్ ను సమర్థించాడని ఫైర్ అయ్యారు. 2019లో వైఎస్ వివేకాను గొడ్డలితో చంపి నారసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డిశబరి, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

