తెలంగాణలో రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలపై కవిత(Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు, అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు. నిజామాబాద్‌లో చేపట్టిన జనం బాట(Janam Bata) కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 పరీక్షలో తెలంగాణ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ఈ అంశంపై తాను సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని తెలిపారు. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గమని, తెలంగాణ యువతకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ‘‘గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాను. ఆయన సుమోటో గా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. ఆ 8 మంది గ్రూప్ -1 స్థాయిలో ఉండి 30 ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తాం. యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతాం’’ అని అన్నారు.
Janam Bata | ‘‘రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, ఉద్యమకారులను కలుస్తాం, వాళ్లు పెన్షన్ కావాలని అంటున్నారు. దానికోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. నిజామాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు, ఉద్యమకారులు కూడా వచ్చి నన్ను కలిశారు. అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే నా కోరిక. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని. వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశా’’ అని వ్యాఖ్యానించారు.
Read Also: ‘అవకాశం, అధికారం, ఆత్మగౌరవమే మా విధానం’

