కలం వెబ్ డెస్క్: ఇటీవల కొన్ని మీడియా చానెళ్లలో, సామాజిక వేదికల్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై (Women IAS) అబద్ధపు ఆరోపణలు, ఊహాజనిత కథనాలు ప్రసారం కావడాన్ని తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్(Telangana IPS Officers Association) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడానికి, మీడియా ద్వారా సెన్సేషనల్ వార్తలు చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను నిజాయితీతో, ధైర్యంగా, వృత్తిపరమైన నైపుణ్యంతో నిర్వహిస్తున్నారని పేర్కొంది. వారి పేరు, హోదా, వ్యక్తిగత జీవితంపై అబద్ధాల ఆధారంగా విమర్శించడం సరికాదని సూచించింది. ఇది చట్టపరంగా తప్పు అని, నైతికంగా కూడా సమర్థించలేనిదని పేర్కొంది.
మహిళా ఐఏఎస్ అధికారిపై సదరు మీడియా చేసిన ఆరోపణలు అసత్యమని, అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాలతో మహిళా అధికారుల గౌరవానికి, ప్రొఫెషనల్ ప్రతిష్ఠకు, గోప్యతకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మాధ్యమాల ద్వారా విచారణ అనేది చట్టపరంగా అనుమతించబడదని గుర్తు చేసింది. మహిళా అధికారులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం సదరు మీడియా పక్షపాత భావనను స్పష్టం చేసిందని మండిపడింది.
దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు సదరు వార్తలను తొలగించాలని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్‌లు డిమాండ్ చేశాయి. మీడియా నైతిక విధానాలను పాటించాలని సూచించాయి. అధికారులపై అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ (IPS Association) హెచ్చరించింది. మహిళా అధికారులు భయపడకుండా, పక్షపాతం లేకుండా, వేధింపులు లేకుండా పని చేసుకోగలిగే భద్రత కల్పిస్తామని, వారి గౌరవం కాపాడుతామని స్పష్టం చేసింది.
Read Also: ఐఏఎస్ అధికారిణి ప్రతిష్టను దిగజారుస్తారా?
Follow Us On : WhatsApp


