కలం డెస్క్: మహిళా ఐఏఎస్ అధికారితో ఓ మంత్రి అసభ్య ప్రవర్తన అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IAS Officers Association) ఆగ్రహం వ్యక్తం చేసింది. కథనం పేరుతో మహిళా అధికారి ప్రతిష్టకు భంగం కలిగిందని, ఇది జర్నలిజం విలువలకు పాతరేయడమేనని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా వాస్తవ విరుద్ధమైన కథనాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానెల్ యాజమాన్యం తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఒక ప్రకటనలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణారావు (చీఫ్ సెక్రటరీ), జయేశ్ రంజన్ (పురపాలక శాఖ స్పెషల్ సీఎస్) డిమాండ్ చేశారు. ఆమె క్యారెక్టర్‌ను కించపరిచేలా కథనాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానెల్ ఇప్పుడు ఆమె తన పనిని స్వేచ్ఛగా చేసుకునే వాతావరణం లేకుండా చేసిందని పేర్కొన్నారు. తక్షణం ఈ కథనం లింకులను ఆ టీవీ ఛానెల్ అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కథనానికి కొనసాగింపుగా మరికొన్ని మీడియా సంస్థలు కూడా వేర్వేరు రూపాల్లో కథనాలుగా ప్రసారం చేయడం ద్వారా సదరు మహిళా అధికారికి ఇబ్బందులు తలెత్తాయని అసోసియేషన్ పేర్కొన్నది. మంత్రి నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ ఛాటింగ్స్ కారణంగా కుటుంబంలో అసౌకర్యం కలిగిందంటూ కథనంలో పేర్కొన్నవన్నీ పచ్చి అబద్ధాలని, దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలేనని, ఆ అధికారి ప్రతిష్టను దిగజార్చేవని పేర్కొన్నది. కథనాన్ని ప్రసారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలన్న నైతికతను ఛానెల్ పాటించలేదని అసోసియేషన్ తప్పుపట్టింది. మంత్రి, అధికారిణి మధ్య సంబంధాలను అంటగట్టడమే కాకుండా సౌకర్యవంతమైన పోస్టింగ్‌లు దక్కాయని నొక్కిచెప్పడాన్ని వేలెత్తి చూపింది. ఛానెల్ యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు అవసరమైన సివిల్, క్రిమినల్, లీగల్ చర్యలకు వెనకాడబోమని అసోసియేషన్ హెచ్చరించింది.

Read Also: దావోస్ వేదికగా క్యూర్, ప్యూర్, రేర్
Follow Us On: X(Twitter)


