కల్యాణలక్ష్మిపై స్వల్ప ఊరట!

కలం, తెలంగాణ బ్యూరో: కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాల కొనసాగింపుపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్వల్ప ఊరటనిచ్చింది. దివ్యాంగులైన వధువులకు మాత్రం ఈ స్కీమ్‌ను యధావిధిగా అమలు చేయవచ్చునని, వారిపైనా ఇప్పటివరకూ ఉన్న మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నది. గతంలో ప్రతిపాదించినట్లుగా సాధారణ లబ్ధిదారులతో పోలిస్తే 25% అదనపు ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. కానీ మిగిలిన లబ్ధిదారులకు మాత్రం ఈ పథకాలను అమలు చేయడానికి వీల్లేదని, ఇప్పుడు వర్తిస్తున్న స్టే ఉత్తర్వులు యధావిధిగా కంటిన్యూ అవుతాయని పేర్కొన్నది. లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందకపోవడంలోని ఇబ్బందులపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను వినిపించడానికి రెండు వారాల గడువు కోరడంతో సమ్మతి తెలిపింది. అప్పటివరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా అది ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగానే జస్టిస్ శ్రవణ్ కుమార్ సోమవారం పై ఉత్తర్వులు ఇచ్చారు.

భూసేకరణ పరిహారం చెల్లింపులపై అఫిడవిట్ :

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీముల అమలుపై న్యాయవాది విజయ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రజా ధనం దుర్వినియోగం అంశంపై హైకోర్టు ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవైపు భూ సేకరణ చేపట్టిన తర్వాత నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం సకారం చెల్లించడంలేదని, రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆక్షేపించింది. భూ సేకరణ పరిహారం చెల్లింపులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. దీంతో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఇంకోవైపు ఈ పథకాల అమలుపై సింగిల్ జడ్జి స్టే విధించడపై ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. బాల్య వివాహాలను అరికట్టి నిరుపేద యువతులకు పెళ్లికానుకగా డబ్బులు ఇచ్చే పథకాలపై స్టే విధించడం సమంజసం కాదని, లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నది. ఈ పిటిషన్ ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలోనే ఉండిపోయింది.

భిక్షాటన చేస్తున్న మహిళల సంగతేంటి ?

ఈ రెండు పథకాలపై సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ శ్రవణ్ కుమార్ కీలక అంశాలను ప్రభుత్వ న్యాయవాదికి సంధించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే ఏ చట్టం కింద పంపిణీ చేస్తాంటూ ప్రశ్నించారు. ఇలా పంపిణీ చేయడమే రాజకీయాలకు తావిచ్చినట్లవుతున్నదని అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలనే అనుకుంటే హైదరాబాద్ నగరంతో పాటు చాలా చోట్ల ఎంతో మంది నిరుపేద మహిళలున్నారని ప్రస్తావించారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర నిత్యం చిన్నారులు అడుక్కుంటూ (భిక్షాటన) ఉన్నారని, కనీసం వారికి ఆధార్ కార్డులు కూడా లేవన్నారు. భూసేకరణకు ప్రభుత్వం చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో మరో రెండు ఇంప్లీడ్ పిటిషన్‌లు దాఖలు కావడంతో వాటిని కూడా అటాచ్ చేసింది. భూపరిహారం అందలేదంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఎమ్మెల్యే పిటిషన్ వేశాడు. భూపరిహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>