కలం, నల్లగొండ: కనగల్ ఎక్స్‌రోడ్డు వద్ద డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని జేసీబీతో తొలగించి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దళిత సమాజానికి క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు మౌన మానవహారం, ర్యాలీ నిర్వహించారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం రాజ్యాంగాన్ని, దళిత సమాజాన్ని తీవ్రంగా అవమానించడమేనని నాగం వర్షిత్ రెడ్డి మండిపడ్డారు. విగ్రహ ధ్వంసానికి బాధ్యులైన కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ప్రదేశంలోనే ప్రభుత్వ ఖర్చులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారను. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వర్షిత్ రెడ్డి హెచ్చరించారు.

