కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిని బావిలో పడేసి హత్య చేసిన అనంతరం, ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు హత్య కేసులో నిందితులుగా అరెస్టయ్యారు. సైదాపూర్ మండలం ఎలబోతారం (Elabotharam) గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ (వృద్ధురాలు) దారుణ హత్యకు గురయ్యారు.
వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు. కొంతకాలం క్రితం పక్షవాతం రావడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. నలుగురు కొడుకులు వంతుల వారీగా తల్లిని చూసుకోవాల్సి ఉండేది. అయితే ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లోనే మృతి చెందితే ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని అరిష్టంగా భావించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో మంచానికే పరిమితమైన వెంకటమ్మను సుమారు నాలుగు నెలల క్రితం బావిలో పడేసి హత్య చేసినట్లు తేలింది.
కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
తల్లిని బావిలో పడేసిన అనంతరం ఆమె కనిపించడం లేదంటూ ఏప్రిల్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. పక్షవాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు బావిలోకి ఎలా పడిపోయిందనే అనుమానం పోలీసులకు కలిగింది. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సుమారు ఐదు నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం వెంకటమ్మ హత్యకు ఆమె పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసినట్లు హుజురాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ స్వాతి తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

