కలం, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) టెస్టు క్రికెట్లో మరో వీరేందర్ సెహ్వాగ్ లాగా మారతాడని అతడి చిన్ననాటి కోచ్ ఉత్తమ్ మజుందార్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రాణించి మళ్లీ టీమిండియా వైట్ బాల్ జట్టులోకి అడుగుపెట్టిన ఇషాన్, ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఆటతీరు, సామర్థ్యంపై ఆయన కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ జూలై 2023లో వెస్టిండీస్‌పై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడి, ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు.
అంతకుముందే డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌పై 210 రన్స్ బాది, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మల సరసన చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇషాన్, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర మ్యాచ్ విన్నర్లలో ఒకడని మజుందార్ అన్నారు. టెస్టుల్లో సెహ్వాగ్ వేగవంతమైన బ్యాటింగ్‌తో కొత్త శకానికి నాంది పలికారని గుర్తుచేశారు. ఇషాన్ దగ్గర కూడా సరిగ్గా అలాంటి ఆక్రమణ ఆటతీరు ఉందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరోవైపు, యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు మజుందార్ ‘ఇండియన్ క్రికెట్ అకాడమీ లీగ్’ (ICAL) ను ప్రారంభించారు. అకాడమీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి ఆటగాళ్లను తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ లీగ్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌లో ప్రారంభం కాగా, అక్టోబర్, నవంబర్ నెలల్లో ట్రయల్స్, క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తు తరం క్రికెటర్లు వెలుగులోకి వస్తారని భావిస్తున్నారు.

